జనాస్త్రం ప్రతినిాది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోండి
ఓటు హక్కును సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోండి
జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్
నంద్యాల, జనవరి 25 (జనా స్త్రం న్యూస్)
ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును ప్రతి ఓటరు సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిఆర్ఓ రామునాయక్, నంద్యాల, ఆత్మకూరు, డోన్ రెవెన్యూ డివిజనల్ అధికారులు విశ్వనాథ్, నాగజ్యోతి, నరసింహులు, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని ఓటు హక్కును ప్రతి ఒక్కరు సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. 1947 సంవత్సరంలో మన దేశంతో పాటు ఆఫ్రికన్, ఏషియన్ దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద ప్రజాస్వామ్యం ఏ దేశానికి లేదని ఇందుకు దేశ పౌరులను మనందరం గర్వపడాలన్నారు. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో భారత ఎన్నికల సంఘం కృషి ప్రశంసనీయమని జెసి తెలిపారు. 1950లో భారతదేశ జనాభా 30 కోట్లు అయినప్పటికీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత ఎన్నికల సంఘం శాంతియుతంగా, సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిందన్నారు. బ్యాలెట్ పత్రాలకు బదులుగా 2003-04 సంవత్సరాలలో ఈవీఎంలను ప్రవేశపెట్టి పట్టిష్టవంతంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఎన్నికలను నిర్వహిస్తోందని జెసి తెలిపారు. 75 సంవత్సరాల క్రితం భారత ఎన్నికల సంఘం స్థాపించబడి తనదైన శైలిలో మెరుగులు దిద్దుకుంటూ 99 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేసి ప్రజాస్వామ్య ప్రతిష్టతకు దేశ పౌరులుగా గర్వపడాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు ఓటర్ల జాబితాలో నమోదు కావాలని సూచించారు.
అనంతరం యువ ఓటర్లకు, సీనియర్ సిటిజనులకు ఎపిక్ కార్డులు పంపిణీ చేశారు. అంతకుముందు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటు హక్కుకు ఉన్న విలువను ఓటర్లు తెలుసుకొని ఓటు హక్కు ను వినియోగించు కోవాలని ప్రజలందరిచేత జాతీయ ఓటర్ల ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారులు, అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్ఓలు, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.