!!జిల్లాను అభివృద్ధి చేస్తాం.. మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ!!

⇔జనాస్త్రం ప్రతినిది మారంరె్డి జనార్ధనరెడ్డి

గత పాలకుల నిర్లక్ష్యంతో జిల్లాలో అభివృద్ధి కుంటు పడిందని సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

శనివారం నంద్యాల పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ లతో కలిసి మంత్రులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రజలకు వాగ్దానం చేసిన మేరకు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని అదనపు ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. గోరుకొల్లు రిజర్వాయర్ నుండి అదనపు పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 13 లక్షల 58 కోట్ల రూపాయల అప్పు ప్రస్తుత ప్రభుత్వం మీద పెట్టిందని ఆర్థిక లోటు తీవ్రంగా ఉన్నప్పటికీ అప్పులు తీర్చడంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అన్ని వర్గాల పెన్షన్ దారులకు పెంచిన వేయి రూపాయలు మొత్తాన్ని కలిపి జూలై 1వ తేదీన ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి పెరిగిన పెన్షన్ సొమ్ము నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు మాసాల అరియర్స్ కలుపుకొని మొత్తం 7000 వేల రూపాయలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు. గతంలో నంద్యాల జిల్లా నెలకు 65.86 కోట్ల రూపాయలు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేవారని ప్రస్తుత జూలై మాసంలో అరియర్స్ తో కలిపి 150.23 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 2,21,240 మంది పెన్షన్దారులకు ప్రతినెల 93.14 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుపేదల సుఖసంతోషాలను దృష్టిలో పెట్టుకొని పెన్షన్ మంజూరులపై మొట్టమొదటి సంతకం చేశారన్నారు. అలాగే రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన లాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశారన్నారు. మైనింగ్ శాఖలో అక్రమంగా ఇసుక, ప్రకృతి సంపదలను అనుమతులకు మించి త్రవ్వుకోవడం తద్వారా ప్రభుత్వానికి రావలసిన రాయల్టీకి గండి కొట్టి తీవ్రంగా నష్టపరిచారని వీటన్నిటిపై సమగ్ర నివేదికలు అధికారుల నుండి తెప్పించుకొని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీలతో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. అటవీ ప్రాంతాల్లో కూడా కొండలను కొల్లగొట్టి, ప్రకృతి సంపదను విచ్చలవిడిగా దోచుకొని అసాంఘిక సంఘటనలకు పాల్పడిన వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. జిల్లాలో రోడ్లు అద్వాన స్థితిలో ఉన్నాయని అన్ని నియోజకవర్గాల్లోని శాసనసభ్యుల ద్వారా నివేదికలు తెప్పించుకొని డిపిఆర్ సిద్ధం చేసి రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ కూడ నిర్వీర్యం అయిందని గ్రామాల్లో వీధిలైట్లు, మురుగు కాలువలు, అంతర్గత రోడ్లు లేవని…. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. అలాగే నాబార్డ్ ద్వారా వచ్చిన 370 కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియడం లేదని మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో గుత్తేదారులకు 2700కోట్ల రూపాయలు బకాయలు ఉన్నాయని మంత్రి తెలిపారు. పార్టీ కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులను న్యాయబద్ధంగా పోరాటం చేసి కాపాడుకుంటామని మంత్రి వివరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *