!!సెంట్రల్ టీంకు పంట నష్టాన్ని వివరించండి … జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు!!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

గత సంవత్సరం రబీ సీజన్ లో పంట నష్టపోయిన వివరాలను ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీంకు స్పష్టంగా నివేదించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీనివాసులు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన చాంబర్లో కేంద్ర కరువు బృంద పర్యటనపై జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర బృందం టీమ్ లీడర్, న్యూదిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండేచర్ డైరెక్టర్ చిన్మయ గాట్మేర్ (ఐఏఎస్), తాగు నీరు, పారిశుద్ధ్యశాఖ డిప్యూటీ అడ్వైజర్ (పీహెచ్) ఆషిస్ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద కుమార్ సోని సభ్యుల బృందం ఈ నెల 20వ తేదీన జిల్లాకు రానుందని, కేంద్ర కరవు బృందం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, కరవు తీవ్రతను ఆ బృంద పరిశీలకులకు సమగ్రంగా వివరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. కరువుకు సంబంధించి 13 మండలాల్లో 36,389 హెక్టార్లలో పప్పు సెనగలు, 4,116 హెక్టార్లలో మినుములు, 2,076 హెక్టార్లలో పొగాకు, 12,908 హెక్టార్లలో జొన్న పంటలకు జరిగిన నష్టాన్ని స్పష్టంగా, అర్థమయ్యే రీతిలో ఇంటర్ మినిస్టీరియల్ టీంకు వివరించాలన్నారు. తమ్మరాజు పల్లి లోని వాటర్ స్కీము, కోయిలకుంట్ల మండలంలోని భీమునిపాడు గ్రామం, ఉయ్యాలవాడ మండలంలోని హరివరం గ్రామాలలో కేంద్ర కరవు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్న నేపథ్యంలో వివిధ పంటలను సాగు చేసి నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి నష్టపోయిన పంటల ఫోటోలను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించాలన్నారు. అలాగే పశుగ్రాస కొరత వల్ల తగ్గిన పాల ఉత్పత్తి, కరువు మండలాల్లో కూలీలకు కల్పించిన పనులు, ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా, రబీలో సాగుకు సరఫరా చేసిన సాగునీటికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు నివేదికలను సిద్ధం చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, జిల్లా వ్యవసాయ అధికారి మురళీ కృష్ణ, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, భూగర్భ జల శాఖ డిడి రఘురాం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ మనోహర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *