నంద్యాల తెలుగుదేశం పార్టీలో తండ్రి విజయం కోసం మాజీ మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్ రేయింబగళ్లు తిరుగుతున్నారు. నంద్యాల అసెంబ్లీ ఇన్చార్జిగా ఫరూక్‌ను ప్రకటించిన దగ్గర నుంచి నియోజకవర్గంలోని ఏవి సుబ్బారెడ్డి, తులసీ రెడ్డి, కొట్టాల శివనాగిరెడ్డి, న్యాయవాది రామచంద్రారావు, చింతల సుబ్బరాయుడులతోపాటు మరికొంత మంది నేతలను నియోజకవర్గ స్థాయి సమావేశాలకు ఆహ్వానించి, వారితో కార్యకర్తలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణ కేంద్రంలోని ప్రధాన ఛాయ్ సెంటర్లకు ఉదయం వెళ్లి తెలుగుదేశం పార్టీ సిక్స్ ప్యాక్‌ను వివరిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఫరూక్ గెలిచి తీరుతారని పత్రికా సమావేశాల్లో వివరిస్తున్నారు. స్థానిక ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిల పై ఆరోపణల అస్త్రాలను సంధిస్తున్నారు. పట్టణంలో ఏదోక వార్డును ఎంపిక చేసుకొని దాదాపు 50 మందికి పైగా కార్యకర్తలను వెంట పెట్టుకొని తెలుగుదేశం పార్టీని బలపరచాలని ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నారు. వైసిపికి ఓటు వేయడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని కుడా చెబుతున్నారు. నంద్యాల పట్టణంలోని 42 వార్డులతో పాటు నంద్యాల, గోస్పాడు మండలాల్లోని నాయకులను కుడా కలుసుకొని విబేధాలను విస్మరిద్దాం ,టిడిపిని గెలిపిద్దాం అంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాను కుడా సంపూర్ణంగా వాడుకుంటున్నారు.