ఫరూఖ్ విక్టరీకి ఎ.వి కీ రోల్…

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి

#అసెంబ్లీపై పట్టు ఉండటం 

#2009లో అసెంబ్లీకి పోటీచేయడం

#రాజకీయ వ్యూహాలలో టాప్

#ఫరూక్‌ తరుపున చక్రం తిప్పుతున్న ఏవీ

నంద్యాల తెలుగుదేశం అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ను గెలిపించడంలో మాజీ ఆర్‌ఐసీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి కీలక పాత్రను పోషిస్తున్నారు. నంద్యాల అసెంబ్లీకి 2004 నుండి 2019 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేసిన ఫరూక్‌, ఎన్‌హెచ్‌ భాస్కర్‌ రెడ్డి, శిల్పా మోహన్‌ రెడ్డి భూమా బ్రహ్మానంద రెడ్డిలు ఓటమి చవి చూశారు. 2014 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం తప్పితే సాధారణ ఎన్నికల్లో జరిగిన ఓటములు ఆ పార్టీ నాయకులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా ఫరూక్‌ పోటీ చేస్తున్నారు. ఆయనకున్న లీడర్లలలో చాలా మంది గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులే ఉన్నారు. ఒక్క ఏవీ సుబ్బారెడ్డి మాత్రమే నియోజకవర్గం మీద పట్టున్న నాయకుడు. అంతేకాక 2009లో ప్రజారాజ్యం తరుపున నంద్యాల అసెంబ్లీకి పోటీ చేసి నంద్యాల మున్సిపాలిటీతో పాటు నంద్యాల, గోస్పాడు మండలాల్లో బలమైన నాయకులను తయారు చేసుకొని 36 వేల ఓట్లను సంపాదించి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం టికెట్‌ కోసం ప్రయత్నం చేసి విఫలమవుతూ వస్తున్నారు. ఇప్పుడు ఫరూక్‌ను గెలిపించడంలో తనకున్న అనుభవాన్ని రంగరించి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. రేపు జరిగే పోలింగ్‌ రోజున ఏవీనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫరూక్‌ రాజకీయ ప్రత్యర్థి అయిన శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డిని ఢీకొనడం ఆశామాషీ కాదు. ఏవీ లాంటి వ్యూహకర్త ఉంటే తప్ప శిల్పా వారి వ్యూహాలను అడ్డుకోవడం కష్టమవుతుంది. 200లకు పైగా పోలింగ్‌ కేంద్రాలున్న నంద్యాల పట్టణంలో ఏజెంట్లను నియమించుకోవడం పెద్ద సమస్య అవుతుంది. ఫరూక్‌ కూడా 2009 నుండి 2024 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఫరూక్‌ కు పట్టుతప్పి పోయింది. దీంతో ఏవీ పాత్ర ఫరూక్‌కు చాలా అవసరం అయ్యింది. ప్రస్తుతం ఇరువురు ఐక్యమత్యంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నంద్యాలలో తెలుగుదేశం జెండా ఎగురవేసి చంద్రబాబుకు గిఫ్ట్‌ ఇస్తామని ఏవీ పదేపదే పేర్కొంటున్నారు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఫరూక్‌ తరుపున పలు రకాల మాస్టర్‌ ప్లాన్లను నామినేషన్‌ రోజు నుండే అమలు చేయాలని ఏవీ భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *